Home  »  Featured Articles  »  మ‌హాన‌టి సావిత్రి.. ‘దేవదాసు’, ‘మిస్సమ్మ’ వంటి క్లాసిక్స్ చేయడానికి రీజన్ భానుమతి.. ఎలాగంటే..?

Updated : Apr 22, 2026

ఎన్నో అద్భుతమైన సినిమాలు, క్లాసిక్స్‌ను నిర్మించిన సంస్థ విజయ ప్రొడక్షన్స్. ఈ బేనర్‌లో నిర్మించిన తొలి సినిమా ‘షావుకారు’ విడుదలై 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా తర్వాత వచ్చిన పాతాళభైరవి, అప్ప్పుచేసి పప్ప్పుకూడు వంటి సినిమాలు చాలా పెద్ద విజయం సాధించాయి. విజయ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి సినిమా వస్తోంది అంటే ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఎందుకంటే ఆ బేనర్‌లో విభిన్నమైన కథలతో, ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించే సినిమాలు వస్తాయని ప్రేక్షకుల నమ్మకం.

ఆ నమ్మకాన్ని నిలబెడుతూ తాము చేసే ప్రతి సినిమా వినోదాత్మకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకునేవారు నిర్మాతలు చక్రపాణి, నాగిరెడ్డి. వీరి బేనర్‌లో వచ్చిన ఆరో సినిమా ‘మిస్సమ్మ’. ఈ సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. అప్పటికి ఎన్టీఆర్ కంటే ఎఎన్నార్ చాలా సీనియర్. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్‌కి పాతాళభైరవి పెద్ద హిట్ సినిమా. ‘మిస్సమ్మ’ చిత్రంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తే.. ఎఎన్నార్ డిటెక్టివ్ రాజు అనే కామెడీ క్యారెక్టర్ చేశారు. ఆ సమయంలో అలాంటి క్యారెక్టర్ చేసినందుకు ఎఎన్నార్ విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. తెలుగులో ఎన్టీఆర్ చేసిన క్యారెక్టర్‌ను తమిళ్‌లో జెమినీ గణేశన్ పోషించారు. ఎఎన్నార్ చేసిన పాత్రలో తంగవేలు నటించారు. 

ఈ సినిమాలో మొదట ఫిక్స్ అయిన హీరోయిన్ భానుమతి. సినిమాలోని మేరీ క్యారెక్టర్ ముక్కు సూటిగా మాట్లాడుతుంది. ఆ క్యారెక్టర్‌కి భానుమతి అయితే పూర్తి న్యాయం చెయ్యగలదని దర్శకనిర్మాతలు భావించారు. అయితే ఈ క్యారెక్టర్‌ని భానుమతితో కాకుండా సావిత్రితో చేయించడం వెనుక పెద్ద కథ ఉంది. ఒక క్రిస్టియన్ క్యారెక్టర్ చేసేందుకు మొదట భానుమతి కాస్త సందేహించినా కథపై ఉన్న నమ్మకం వల్ల ఒప్ప్పుకున్నారు. ఎన్టీఆర్, భానుమతి, రేలంగి, రమణారెడ్డిలపై వచ్చే సీన్స్‌ని ముందుగా షూట్ చేశారు.

విశేషం ఏమిటంటే.. ఈ సినిమాలో మేరీ చెల్లెలు సీతగా మొదట సావిత్రి నటించారు. షూటింగ్ సజావుగా సాగుతోంది. సినిమా బాగా వస్తోందని దర్శకనిర్మాతలు సంతప్తిగా ఉన్నారు. అప్పటికి నాలుగు రీళ్ళు షూటింగ్ జరిగింది. ఒకరోజు ఉదయం ఏడున్నరకి షూటింగ్ స్టార్ట్ చేసేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. నటీనటులతోపాటు యూనిట్ సభ్యులు కూడా లొకేషన్‌కి వచ్చేసారు. భానుమతి మాత్రం రాలేదు. చాలా సేపు ఎదురుచూసిన తర్వాత నిర్మాత చక్రపాణి ఒక నిర్ణయం తీసుకున్నారు. సినిమాలో సీత క్యారెక్టర్ చేస్తున్న సావిత్రిని పిలిచి మేరీ కాస్ట్యూమ్ వేసుకొని రమ్మన్నారు. సావిత్రికి ఏం జరుగుతుంది అనేది అర్థం కాలేదు. చక్రపాణి చెప్పినట్టుగానే కాస్ట్యూమ్ వేసుకొని వచ్చారు. అలా సావిత్రి హీరోయిన్‌గా ‘మిస్సమ్మ’ షూటింగ్ మొదలు పెట్టారు.  

మధ్యాహ్నం ఒంటిగంటకు భానుమతి సెట్‌కి వచ్చారు. ‘నేను మధ్యాహ్నం వస్తానని చెప్పాను కదా.. నాకోసం ఎందుకు ఎదురుచూశారు. మా ఇంట్లో వరలక్క్ష్మీ వ్రతం ఉంది. నేను మధ్యాహ్నం నుంచి వస్తానని మేనేజర్‌కి చెప్పాను. మా అసిస్టెంట్‌తో లెటర్ కూడా పంపించాను’ అన్నారు. అయితే భానుమతికి తెలియనిది ఏమిటంటే.. మిస్ కమ్యూనికేషన్ వల్ల తను లేట్‌గా వస్తానన్న విషయం చక్రపాణికి చేరలేదు. అయితే అవేవీ పట్టించుకోని చక్రపాణి ‘నువ్వు ఇంట్లో హాయిగా వ్రతాలు చేసుకో.. సినిమా ఎందుకు’ అని ఎగతాళిగా అన్నారు. దాంతో భానుమతి బాగా హర్ట్ అయి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అలా భానుమతి స్థానంలోకి సావిత్రి వచ్చారు. ఆ తర్వాత సీత పాత్ర కోసం జమునను తీసుకున్నారు. అప్పటివరకు షూటింగ్ చేసిన నాలుగు రీళ్లను తగలబెట్టేశారు చక్రపాణి. అప్పటికే ‘దేవదాసు’ వంటి అద్భుతమైన చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరైన సావిత్రిని మరింత దగ్గర చేసిన సినిమా ‘మిస్సమ్మ’. నిజానికి ‘దేవదాసు’లో కూడా మొదట అనుకున్న హీరోయిన్ భానుమతే. కొన్ని కారణాల వల్ల సావిత్రిని ఎంపిక చేశారు. అలా సావిత్రి కెరీర్‌లో రెండు క్లాసిక్స్ చేసేందుకు భానుమతి కారణమయ్యారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.